అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక  నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నారు. 

ఇటీవలే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

మరికాసేపట్లో తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించనున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 

ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత కేబినేట్ లో తీసుకున్నారు. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 

ఇకపోతే గతంలో 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు.