ప్రముఖ సినీనటి, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అస్వస్థతకు గురయి చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ సినీనటి ఆర్కే రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కాలు వాచి విపరీతమైన నొప్పితో రోజా బాధపడ్డారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం కుదుటపడినట్లు సమాచారం. 

కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు మంత్రి రోజా ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నై వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆమె కాలునొప్పి మొదలవడంతో చెన్నైలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఆమెకు డాక్టర్లు వైద్యం అందించడంతో కాలివాపు తగ్గి కోలుకున్నారు. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే మంత్రి అస్వస్థతకు గురయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More లిఫ్ట్‌లో చిక్కుకున్న ఏపీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే అవంతి, అధికారులు..

మంత్రి రోజా అస్వస్థతతో హాస్పిటల్లో చేరినట్లు తెలిసి వైసిపి నాయకలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సహచర మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు సైతం రోజా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడారు.