అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పేర్ని నాని. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. 

పవనిజం అంటూ పదేపదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ జగన్ ను వ్యతిరేకించడమే పవనిజమా అంటూ నిలదీశారు. చంద్రబాబుతో లాలూచీపడి సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. 

చంద్రబాబు నాయుడుతో లాలూచీపడి జగన్ పేచీ పెట్టుకోవడమే పవన్ రాజకీయమా అంటూ నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పవన్ కళ్యాణ్ కి కనిపిపించడం లేదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు చంద్రబాబు నాయుడు కారణమని మంత్రి పేర్నినాని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో దాదాపు 80 శాతం పూర్తి చేసినట్లు పేర్ని నాని చెప్పుకొచ్చారు. 

సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పవన్ కళ్యాణ్ పరిశీలించాలని హితవు పలికారు. సీబీఐ కేసులు అనేవి ఆరోపణలు మాత్రమేనని వాటిని బూచిగా చూపించి మాట్లాడటం తగదన్నారు. 

రాష్ట్ర అభివృద్ధికోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం సైతం జగన్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పేర్నినేని నాని స్పష్టం చేశారు.