రిటర్న్ గిఫ్ట్ దేవుడెరుగు.. కుప్పంలో ముందు బాబు గెలవాలి కదా..: లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు
రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెటైర్లు వేశారు. ముందు కుప్పంలో గెలవాలని ఆయన సవాల్ విసిరారు.
అమరావతి: రిటర్న్ గిఫ్ట్ దేవుడెరుగు...కుప్పంలో ముందు గెలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెటైర్లు వేశారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో లోకేష్ పేరును ఏ 14 గా ఏపీ సీఐడీ ఈ నెల 26న చేర్చింది.ఈ విషయమై లోకేష్ స్పందిస్తూ ఆరు నెలల తర్వాత వైఎస్ జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు.ఈ విషయమై బుధవారంనాడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలిచి చూపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
సర్వేలన్నీ జగన్ కు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ఎవరిపై కక్షలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. కక్షసాధింపు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు పదవుల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. పదవుల్లో ఉన్న సమయంలో ప్రజా ధనం కొల్లగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది.
also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం: హెరిటేజ్ ఫుడ్స్ పై కేసు నమోదు
ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారంట్లు ఏసీబీ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. మరో వైపు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్‌పీని దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.