గుంటూరు: ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కేసీఆర్, కేటీఆర్ ప్లానేనని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

కేసీఆర్, జగన్ హైద‌రాబాద్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌, కేటీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలతో మాట్లాడి వైసీపీలోకి వెళ్లేలా ప్లాన్ లు వేస్తున్నారంటూ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఆంధ్రకి వ‌చ్చి వైఎస్ జ‌గ‌న్‌తో క‌లిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు.

 హైదరాబాద్‌లో ఆస్తులు పోతాయనన భయంతో నేతలు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. మరోవైపు అమలాపురం ఎంపీ ర‌వీంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రవీంద్రబాబు నైతిక విలువ‌లు లేని రాజ‌కీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్వార్థం కోసం పార్టీ మారారని ఆరోపించారు. 

కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మోదీకి ఊడిగం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల గురించి వైఎస్ జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు.