రాష్ట్రంలో కులం పేరుతో కుట్రలు చేయడం మొదలుపెట్టారని ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ, బీజేపీలపై మండిపడ్డారు. 

సంక్షేమ పథకాలతో చంద్రబాబుతో పోటీ పడేలేక.. జగన్ , మోదీలు కలిసి ముకుమ్మడిగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్, మోదీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి అన్నారు.

‘‘పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కెసిఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’’ అని లోకేష్ హెచ్చరించారు.