అమరావతి: పారిపోయే చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఏపీ అసెంబ్లీలో సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ విషయమై గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకొంది.సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా రూ. 3 వేలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 

ఈ విషయమై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పారిపోయే సంస్కృతి, చరిత్ర చంద్రబాబుదని చెప్పారు.

1983లో ఓటమి పాలైనప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పారిపోయాడన్నారు. ఆ తర్వాత చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కుప్పం నియోజకవర్గానికి పారిపోయినట్టుగా చెప్పారు.

ఓటుకు నోటు కేసు తర్వాత హైద్రాబాద్ నుండి కరకట్టకు పారిపోయి వచ్చినట్టుగా తెలిపారు.  కరోనా రాగానే కరకట్ట నుండి హైద్రాబాద్ లోని అద్దాల మేడకు పారిపోయాడని కొడాలి నాని సెటైర్లు వేశారు.

తమ ముఖ్యమంత్రిని ఫేక్ ముఖ్యమంత్రి అంటూ తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన చేతిలోకి తీసుకొన్న చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఫేక్ టీడీపీ అన్నారు. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు అంటూ నాని తీవ్ర విమర్శలు చేశారు.

ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా చంద్రబాబునాయుడు ఏనాడూ రాష్ట్రంలో గెలవలేదని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రతి నెల 1వ తేదీన ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. కొడాలి నాని కామెంట్లపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు.