గాజులు తోడుక్కోలేదు: పవన్‌కి మంత్రి కొడాలి నాని కౌంటర్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఫైరయ్యారు. పవన్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.అందరికీ మేలు జరిగే నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకొంటుందని మంత్రి నాని తెలిపారు.
అమరావతి:జనసేన (jana sena)చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేందుకు గాజులు తొడుక్కోలేదని ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (kodali nani)తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం నాడు ఆయన సినీ పరిశ్రమలో (tollywod ) చోటు చేసుకొన్న సమస్యలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమా టికెట్ల ధరల పెంపును తమ ప్రభుత్వం సమర్ధించబోదని ఆయన చెప్పారు.
అందరికీ మేలు జరిగే నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకొంటుందని కొడాలి నాని తేల్చి చెప్పారు. నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోమని మంత్రి నాని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ 30 సినిమాలు చేశాడు. మరో 30 సినిమాలు చేస్తాడేమో... పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా కాకపోయినా తమకు లాభం ఉండదు, నష్టం ఉండదని కొడాలి నాని చెప్పారు.ఒక వ్యక్తి గురించి తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదన్నారు.
సినిమా టికెట్ల ధరల పెంపు విషయమై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు.ఈ విషయమై కొందరు కోర్టును ఆశ్రయించారు. కమిటీని వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిందని కొడాలి నాని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు సర్కార్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో కమిటీ ఏర్పాటు చేసే వరకు టికెట్ల ధరలను పెంచుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని కొడాలి నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అయితే తమ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.ఈ కమిటీ నిర్ణయం మేరకే ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించాలని భావిస్తోందన్నారు.వకీల్ సాబ్ కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతుందన్నారు. దేవుడి మద్దతుతో పాటు వైఎస్ఆర్ మద్దతు కూడ ఉందని నాని గుర్తు చేశారు.