Asianet News TeluguAsianet News Telugu

ఎందుకు కడపు మంట: పవన్ కల్యాణ్ ను ఉతికి ఆరేసిన మంత్రి కన్నబాబు

కాపు నేస్తంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ కు ఎందుకు కడుపు మంట అని అడిగారు.

AP minister Kannababu retaliates Pawan Kalyan comments on Kapu Nestham
Author
Amravati, First Published Jun 27, 2020, 1:21 PM IST

అమరావతి: కాపు నేస్తంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు మేలు చేస్తే పవన్ కల్యాణ్ కు ఎందుకు కడుపు మంట అని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన శనివారం మీడియా సమావేశంలో తిప్పికొట్టారు.  

పవన్ కల్యాణ్ కు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ సంస్కర్తలాగా కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహానేతగా చందర్బాబు కనిపించారని, అందుకే మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. కాపు సమస్యలపై మాజీ మంత్రి ముద్రగడ ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారని, తాము కాపులకు అండగా నిలిచామని ఆయన చెప్పారు. 

Also Read: కాపు కోటాకి వైఎస్ జగన్ ఎసరు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కాపు నేస్తం అద్భుతమైన పథకమని, కాపు నేస్తం కింద మహిళలకు ఏటా 15 వేల రూపాయల చొప్పున అందిస్తున్నామని ఆయన చెప్పారు. కాపుల కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాపు నేస్తంపై పవన్ కల్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 

ముద్రగడను పచ్చిబూతులు తిట్టినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.  జగన్ అంటే నచ్చడు కాబట్టి పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ విజ్ఞప్తి పత్రంలోనూ ప్రకటనలోనూ జగన్ రెడ్డి అని రాస్తారని, ఆయన రాసినంత మాత్రాన పోయేదేమీ లేదని, కులం దాచుకుంటే దాగేది కాదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం ప్రారంభించారని ఆయన అన్నారు. తమకు యాభై శాతం ఓట్లు వచ్చాయని, ప్రజలు దీవించి 151 సీట్లు ఇచ్చారని, ఈ స్థితిలో తాము అందరినీ సమభావంతో చూస్తుంటే పవన్ కల్యాణ్ ఏం ఆశించి విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios