అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే మోదీ రాకను వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డేగా పాటిస్తోంది. ఇక వామపక్షాలు అయితే ఇప్పటికే రోడ్డెక్కేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కళా వెంకట్రావ్ బహిరంగ లేఖ రాశారు. భిన్నత్వంలో ఏకత్వానికి విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. 

16 నెలలు జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మీ మిత్రుడేనంటూ లేఖలో పేర్కొన్నారు. మోదీ మీరు రాష్ట్రానికి నమ్మక ద్రోహం తప్ప ఏమీ చెయ్యలేదని విమర్శించారు. బీజేపీ యేతర సీఎంలకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ ఆస్తుల కేసును ఎన్ని దశాబ్దాలు విచారిస్తారో స్పష్టం చెయ్యాలని లేఖలో కళా వెంకట్రావ్‌ నిలదీశారు.