పవన్ కళ్యాణ్ పై  ఏపీ  మంత్రి జోగి రమేష్   సీరియస్  వ్యాఖ్యలు  చేశారు. పవన్  కళ్యాణ్  కు సత్తా  ఉంటే  ఒంటరిగా  పోటీ  చేయాలని  ఆయన  డిమాండ్  చేశారు. 


అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వీకేండ్ సైకో అంటూ ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.ఆదివారంనాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటం గ్రామానికి చెందిన 37 మందికి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. పవన్ కళ్యాణ్ కు సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. కోడికత్తి రాజకీయాలు అనే విమర్శలకు 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీకి కట్టబెట్టి ప్రజలు సమాధానం చెప్పారన్నారు.ఇప్పటం ప్రజలను పవన్ కళ్యాణ్ నిలువునా ముంచేశారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ చిల్లర వేషాలు మానుకోవాలని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. 

ఇవాళ ఇప్పటం గ్రామస్తులకు ఆర్ధిక సహయం ఇచ్చే కార్యక్రమంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంటే చూస్తూ కూర్చుంటామా పవన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడితే 2024 ఎన్నికల తర్వాత ఏం చేయాలో అది చేస్తామన్నారు. 

also read:2019 లోనే సత్తా తేలిపోయింది,2024లో కొత్తగా ఏం చేస్తాడు: పవన్‌కి బొత్స కౌంటర్

 తమను రౌడీసేన అంటూ విమర్శలు చేస్తున్న వైసీపీపై ఘాటుగా రిప్లై ఇచ్చారు. అంతేకాదు దౌర్జన్యాలు చేసేవారికి తాము రౌడీలుగా కన్పిస్తామన్నారు. తమది రౌడీ సేన కాదని విప్లవసేన అని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు.