విశాఖపట్నం: ఏపీ ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీకే పట్టంకట్టనున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 125 సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టంకట్టబోతున్నారంటూ జోస్యం చెప్పుకొచ్చారు. 

పోలింగ్ రోజు ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో జరిగిన పొరపాట్లపై తాము సిఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశామని ఆయనే స్వయంగా లోపాలపై అంగీకరించారని తెలిపారు. 

భద్రత ఇవ్వలేకపోయామని, ఓట్లు గల్లంతు నిజమేనని ద్వివేది అంగీకరించారని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. 20 నుంచి 30 శాతం వరకు ఈవీఎంలు పనిచెయ్యలేదన్నారు. తాను పోటీ చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37, 209 బూత్‌లో అర్ధరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని తెలిపారు. 

అధికారులను మార్చి రాష్ట్రంలో భయాన్ని సృష్టించి గెలుపొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఈవీఎంలపై తమ పోరాటం ఆగదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.