విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీతో వైఎస్ జగన్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైఎస్ జగన్ అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నట్లు దేవినేని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జగన్ కు రాజకీయ మనుగడ ఉండదని ఎద్దేవా చేశారు. 

పెథాయ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈనెల 16, 17 తేదీల్లో పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద కాంక్రీట్ పనులను జనవరికి వాయిదా వేస్తున్నట్లు దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. 

నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రూ. 10,069 కోట్లు ఖర్చు చేశామని, కేంద్రం నుంచి ఇంకా రూ. 3,342 కోట్లు రావాల్సి ఉందని మంత్రి దేవినేని తెలిపారు. ఎప్పటికప్పుడు కేంద్ర జల సంఘానికి నివేదికలు, లెక్కలు పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు. 

కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని విమర్శించారు. బకాయి నిధులను వెంటనే విడుదల చేస్తే నిర్వాసితులకు సాయం చేస్తామన్నారు. పోలవరం డీపీఆర్‌-2ను కేంద్రం ఆమోదించడం లేదని దేవినేని ఆరోపించారు. 

ఇప్పటి వరకు 62.16 శాతం పోలవరం పనులు పూర్తి అయినట్లు చెప్పారు. తమ మీద కక్షతో నిధులు నిలిపివేసి రైతులు, ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు. పోలవరం నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని దేవినేని ఉమా మహేశ్వరరావు హామీ ఇచ్చారు.