విజయవాడ: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయాల వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జలాల పంపకాల విషయంలో వైఎస్ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు. 

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీకి మరిన్ని జలాలు  రావాల్సి ఉందన్నారు. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపిస్తోందని ఉమ స్పష్టం చేశారు. 

ఆనాడు వైఎస్‌ సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వైఎస్ నిర్వాకం వల్లే ఏపీకి నష్టం జరుగుతోందని విమర్శించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

తుఫాన్ లపై సమీక్షలు చేస్తుంటే వైసీపీ విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతులు కలిపారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.