అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదని స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వైఫల్యం వల్లే ప్రత్యేక హోదా రాలేకపోయిందని చెప్పుకొచ్చారు. 

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అబద్దాలు చెప్పిందని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం ఏనాడు హోదా ఇవ్వలేమని చెప్పలేదన్నారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు వ్యవహారంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోలేదని కేటాయింపులు చేశామని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకు రెవెన్యూ లోటు పై కేటాయింపులు చేస్తామని కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తే ట్యూషన్ పెట్టించుకోవాలంటూ చంద్రబాబు ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు. 

తాము హోదా అంశంపై ఎలాంటి సూచనలు చేసినా తమకు సబ్జెక్టు తెలియదు అంటూ విరుచుకుపడే వారని గుర్తు చేశారు. తాము ఏదైతే చెప్పామో అదే అంశాన్ని టైటిల్ గా తీసుకుని చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేశారని అది తాము చెప్పిందేనని స్పష్టం చేశారు. 

ప్రత్యేక హోదా సాధించలేకపోగా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని నష్టపరిచారన్నారు. పోనీ ప్రత్యేక ప్యాకేజీలోని అంశాలను అయినా సాధించలేకపోయారని విమర్శించారు. 2014లో ఆర్థిక లోటుపై ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు దిగులుగా ఉంటే ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆయనకు ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. అధైర్యపడొద్దని ప్రజలు ఆందోళన చెందుతారని ధైర్యం చెప్పింది తమ నేత అన్నారు. లోటు బడ్జెట్, ప్రత్యేక హోదా అంశాన్ని ఖచ్చితంగా సాధించుకుందామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  

గత ఐదేళ్ల ప్రభుత్వం ఏపీ ఓవర్ డ్రాప్ట్ మీదే బతికిందన్నారు. పోతూ పోతు ఏపీని అప్పుల్లోకి నెట్టేసి వెళ్లిపోయారని ఆరోపించారు. అంతేకాదు 18 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు పాలన గడ్డుకాలం: ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన