అమరావతి: తెలుగుదేశం పాలన కాలం ఒక బేడ్ పీరియడ్ అంటూ అభివర్ణించారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉందంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని కానీ అది వాస్తవ పరిస్థితులో ఎక్కడా కనిపించడం లేదన్నారు. అంకెలు తప్ప వాస్తవ పరిస్థితుల్లో ఆ అభివృద్ధి కనిపించలేదన్నారు.

వ్యవసాయ రంగం తగ్గుముఖం పట్టిందే తప్ప ఎక్కడా వృద్ధి చెందలేదన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిని పరిశీలిస్తే అన్నీ మైనస్ స్థానంలో ఉన్నాయన్నారు. 

అయితే చేపలు, గొర్రెలు పెంపకం ఉత్పత్తి పెంచడాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ రంగం 33 శాతం పెరిగిందని చూపించారని అది సరికాదన్నారు. చేపల ఉత్పత్తి పెంపకం పెరిగినంత మాత్రాన గ్రోత్ రేట్ అనేది వ్యవసాయ రంగంలో ఉంటుందా అని నిలదీశారు. 

2004 నుంచి 2009 కాల మంధ్యఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు. 12శాతం వృద్ధితో దేశవ్యాప్తంగా ముందుస్థానంలో నిలిచామని తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఏపీ స్థూల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. 
చంద్రబాబు పాలన ఏపీకి గడ్డు కాలమని అభిప్రాయపడ్డారు. 

తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అప్పులు విపరీతంగా పెరిగాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పరిమితికి మించి అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.