న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన బడ్జెట్ అందించబోతున్నట్లు స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు రెండు వారాలు ఓపిక పడితే మంచి బడ్జెట్ అందిస్తానని హామీ ఇచ్చారు. 

రూ.2లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తానని హమీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలైన పథకాలను తమ ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి నవరత్నాలు అమలు చాలా ముఖ్యమన్నారు. వాటి అమలుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 

రాష్ట్రానికి ఆదాయాల మార్గం కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. పదహారు వేల కోట్ల రెవిన్యూ లోటు ఉందని గత ప్రభుత్వం సృష్టించిన కథేనని చెప్పుకొచ్చారు. మద్యం నిషేధం అశంలో రాజీపడేది లేదన్నారు. 

ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, మద్యానికి ఖర్చు చేసే డబ్బు ఇతర అంశాలకు ఖర్చు చేస్తామన్నారు. మద్యపాన నిషేధం వల్ల ఆదాయానికి గండిపడుతున్నా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే తమ ధ్యేయమన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 10 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 12న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీని ప్రత్యేకంగా చూడండి, హోదా ఇచ్చి ఆదుకోండి: కేంద్రాన్ని కోరిన బుగ్గన