విజయవాడ: మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఎవరైనా ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే సగానికి పైగా ప్రజా సమస్యలు పరిష్కరించినట్లేనని చెప్పుకొచ్చారు. 

విజయవాడలో రాష్ట్రస్ధాయి మున్సిపల్ కమిషనర్ల రెండు రోజుల వర్క్ షాపు సమావేశాలను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు ప్రభుత్వం ప్రక్షాళనకే సరిపోయిందన్నారు. 

మున్సిపల్ శాఖ అధికారులు కోరుకున్న స్థానంలోనే ప్రభుత్వ ట్రాన్స్ ఫార్మర్లు జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. 

గ్రామ, వార్డు, సచివాలయం ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఇకపోతే వర్షాకాలం నేపథ్యంలో  సీజన్ లో వచ్చే వ్యాధులపై ద్రుష్టి సారించాలపి ఆదేశించారు.  

మలేరియా, డెంగీ, విష జ్వరాలుపట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విష జ్వరాలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సడన్ విజిట్ చేసినప్పడు తీసుకునే చర్యలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. 

అధికారులు ఎవ్వరు ఏ సమయంలోనైనా ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందేనని తెగేసి చెప్పారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ప్రజల సమస్యలు సగానికి పైగా పరిష్కరించినట్లేనని అభిప్రాయపడ్డారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళిచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని బొత్స సత్యనారాయణ ఆదేశించారు.  

జలశక్తి అభియాన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టులుగా తీసుకున్నామని స్పష్టం చేశారు. 

మున్సిపల్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అక్టోబర్ 2 నుంచి ఇల్లీగల్ కనస్ట్రక్షన్స్ జరగకూడదన్నారు. డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని బొత్స అభిప్రాయపడ్డారు. నవంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుందని తెలిపారు. 

అవినీతి కి ఆస్కారం లేకుండా పాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అంతా సహకరించాలని కోరారు. అధికారులు కూడా తెలియని తప్పులకు ఏం చేయలేం కాని తెలిసి మాత్రం తప్పులు చేయొద్దు అంటూ బొత్స సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు.