విజయనగరం: ఇసుక కొరతను నియంత్రించాలని, ఇసుకను అందుబాటులోకి తేవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనలు కేవలం వారి లబ్ధికోసమేనని విమర్శించారు. ఇసుకపై సంపాదన పోతుందనే ఆందోళనతోనే టీడీపీ అనవసరం రాద్ధాంతం చేస్తోందంటూ మండిపడ్డారు.  

విజయనగరం జిల్లా ప్రగతిపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నఆయన గత ఐదేళ్లుగా టీడీపీ నేతలకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని విమర్శించారు. ఇసుకపై ప్రభుత్వం నూతన పాలసీ విధానం తీసుకురావడంతో వారికి సంపాదన పోతుందనే భయంతో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఏదైనా కొత్త విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇసుకపై తీసుకొచ్చిన నూతన విధానం అమలుకు కూడా అలాంటి పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారు.  

కొన్నాళ్లు ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం ముందే చెప్పిందని స్పష్టం చేశారు. ఇసుకపాలసీపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని కానీ టీడీపీయే అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ మండిపడ్డారు.