2024లో ఆయనకు చివరి ఎన్నికలే: చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తనకు చివరి ఎన్నికలని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తథాస్తు దేవతలు దీవిస్తారన్నారు.
అమరావతి: 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.గురువారంనాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు నిన్న పర్యటించారు. ఈ సమయంలో నిర్వహించిన రోడ్ షో తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇవాళ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని అన్నాడా అని మీడియాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేస్తే అదే నిజం కానుందన్నారు. మనం మంచి కోరుకుంటే మంచి , చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు. మనం ఏదైనా మాట్లాడితే పైన తథాస్తు దేవతలు దీవిస్తారని పెద్దలు చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కాటకాలు వస్తాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా ,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా చంద్రబాబు వ్యవహరించేవాడని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం జగన్ పై విమర్శలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే ఈ విమర్శలపై మంత్రి స్పందించారు. చంద్రబాబును హిట్లర్ తో పాటు ఈస్టిండియా కంపెనీతో పోల్చారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కాకూడదన్నారు.చంద్రబాబు భార్యను ఎవరు అవమానించారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో రికార్డెడ్ గా ఎవరైనా తప్పుగా మాట్లాడారో చూపించాలన్నారు. ఇలా అవమానిస్తే ఎవరూ హర్షించరని బొత్స సత్యనారాయణ చెప్పారు.చంద్రబాబుకు జాలి, దయ లేదన్నారు.