విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు వైసీపీపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే జాలేస్తోందన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు సీఎం వైయస్ జగన్ గానీ, వైసీపీ గానీ బెదిరే ప్రసక్తే లేదన్నారు. 

గత అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో వైసీపీ ప్రభుత్వంలో సమావేశాలు ఎలా జరిగాయో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎన్నికల ప్రచారం మాదిరిగా అసెంబ్లీలో కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తామంటే కుదరదన్నారు. చెప్పిందే చెప్పి పదేపదే అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు మాట్లాడిస్తేనే అసెంబ్లీలు సక్రమంగా జరిగినట్లా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇంకా తాను సీఎం అన్నట్లు భ్రమలో ఉన్నట్లు ఉన్నారని మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ లో నదులుపూర్తి చేసినట్లు పదేపదే చెప్పుకుంటున్న చంంద్రబాబు నాయుడు అసలు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు. ఆనాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ప్రారంభిస్తే దాన్ని ధనయజ్ఞం అన్న చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు నిధులు అనుసంధానం చేశారని మండిపడ్డారు. పట్టిసీమ వంటి పథకాలను అడ్డుపెట్టుకుని భారీ సంఖ్యలో నిధులు దోచుకున్నారంటూ విరుచుకుపడ్డారు బొత్స సత్యనారాయణ. 

చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ఎటుచూసినా కరువేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో తిండిలేక ప్రజలు చనిపోయారని, పనులు లేక వలసలు వెళ్లిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. గత ఐదేళ్లలో జరిగిన రాజకీయ హత్యలు, దాడులు ప్రస్తుతం తమ ప్రభుత్వంలో జరుగుతున్నవి ఒకసారి బేరీజు వేసుకుంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.