విజయవాడ: రాబోయే ఆరు నెలల్లో వైయస్ జగన్ ప్రభుత్వం అంటే ఏమిటో చూపిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలు సంతోషపడటమే కాకుండా అధికారులు సైతం తాము ఇంత మంచి పనిలో భాగస్వామ్యులమయ్యామా అనుకునేలా పాలన ఉంటుందన్నారు. 

విజయవాడలో జరిగిన మున్సిపల్ అధికారుల వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. సీఎం జగన్ ఆకాంక్ష నెరవేరాలంటే అధికారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. 

కొత్త ప్రభుత్వం కదా అని అధికారులు అలుసుగా తీసుకున్నా, చనువు తీసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా ఇబ్బందులు పడతారంటూ అధికారులకు చురకలు అంటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విధి నిర్వహణలో అధికారులు చిత్తశుద్ధిగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రౌండ్ లెవెల్ విజిటింగ్ చాలా కీలకమని అధికారులకు సూచించారు. అయితే గ్రౌండ్ లెవెల్ విజిటింగ్ కు కింది స్థాయి అధికారులు సహకరించడం లేదని అనంతపురం మున్సిపల్ కమిషనర్ మంత్రి బొత్స దృష్టికి తీసుకువచ్చారు. 

మున్సిపల్ కమిషనర్  ఫిర్యాదుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకరించని కింద స్థాయి అధికారులను బదిలీ చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో చేసినట్లు ఈ ప్రభుత్వంలో చేస్తే చూస్తూ సహకరించేది లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.