విశాఖపట్టణం: చంద్రబాబునాయుడు తాను రాజీనామా చేయకుండా అసెంబ్లీని రద్దు చేయాలని కోరడం ఏ మేరకు సబబు అని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రశ్నించారు. మేమేందుకు రాజీనామాలు చేయాలని ఆయన ప్రశ్నించారు. 

గురువారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  సమస్య ఏదైనా ఉంటే రాజీనామాలు చేసి పోరాటం చేసే వాళ్లని చూశామన్నారు. 
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. మళ్లీ మళ్లీ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతానని చంద్రబాబు చెబుతున్నారన్నారు.

రాజధాని విషయంలో  కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు, అయితే ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర ఉండదని హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబునాయుడు తాను చెప్పిన మాటను ఎప్పుడైనా నిలుపుకొన్నారా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రాజధానిగానే ఉంటుందన్నారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

also read:రాజధాని విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం: ఏపీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం

తన స్వార్ధం కోసం చంద్రబాబునాయుడు ఎవరినైనా వదిలేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో అభివృద్ధి జరగకూడదని చంద్రబాబునాయుడు ఉద్దేశ్యమన్నారు. సమాజం కోసం కాకుండా తన సామాజిక వర్గం కోసం బాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.అసెంబ్లీలో తమకు అనకూలంగా ఉన్న మాటలను ఎడిట్ చేసి చంద్రబాబు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.