ఆళ్లగడ్డ: వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసేది తాను కాదని భావించి ఓట్లు వేయాలని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు.వచ్చే ఎన్నికల్లో  నాకు కాదు, అమ్మకు ఓటు వేస్తున్నానని భావించి ఓటు వేయాలని ఆమె కోరారు.

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో  పసుపు-కుంకుమ కార్యక్రమంలో భాగంగా  మాయలూరు, అల్లూరు, తుడుమలదిన్నె గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన సభల్లో  ఆమె మాట్లాడారు. 

దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి చేసిన అభివృద్ధి పనులు గుర్తున్నాయని అన్నారు.శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించినా ఆమెకు ఓట్లు వేసి గెలిపించారని, ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదని, ఆ ఘనత మీదేనని ప్రజలనుద్దేశించి అన్నారు. కన్న కూతురుగా భావించి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. 

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని, తన తల్లి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పోటీ చేస్తున్నారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నాకు కాదు, అమ్మకు ఓటు వేస్తున్నామని భావించి వేయాలని ఆమె కోరారు.పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు