విశాఖపట్నం: మాజీ ఎంపీ, ఆంధ్రాఆక్టోపస్ లగడపాటిరాజగోపాల్ సర్వేపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లగడపాటికి సర్వేల గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. లగడపాటి సర్వేతో ఎంతోమంది వీధినపడ్డారని ఆరోపించారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా  బెట్టింగ్ లకు పాల్పడి కోట్లాది రూపాయలు ప్రజలు నష్టపోయారన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వే మాటలు నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారని తెలిపారు. 

ప్రజల నాడి లగడపాటికి ఏం తెలుసునని నిలదీశారు. ప్రజల నాడి తెలిసినోడు మాత్రమే ఎగ్జిట్ పోల్ నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నమ్మి ప్రజలు కోట్లాది రూపాయలు నష్టపోయారని ఆరోపించారు. 

వారంతా సర్వ నాశనమైపోయారని తెలిపారు. ఇకపోతే లగడపాటి రాజగోపాల్ సర్వేలతో తెలుగుదేశం పార్టీ నేతలు మాంచి హుషారుగా ఉంటుంటే అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.