విశాఖపట్నం : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. వాస్తవాలు తెలియకుండా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

గత ఐదేళ్లలో జరిగిన భూదోపిడీ ఎక్కడా జరగలేదని అది పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా అని నిలదీశారు. ఇసుకపై కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే హస్యాస్పదంగా ఉందన్నారు. ఇసుక గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు, గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ ఎలా ఇసుకను దోచుకున్నారో తన దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు.

ఇసుకదోపిడీపై తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా చర్చకు వస్తానని తెలుగుదేశం పార్టీకి చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిది అని సూచించారు. 

జనసేనను టీడీపీలో విలీనం చేయాలనుకుంటే చేయోచ్చు అని కానీ ఎంతసేపు టీడీపీకి అద్దెమైకులా మాట్లాడకంటి అంటూ సూచించారు. టీడీపీ నేతల అవినీతి పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించడం లేదోనని విమర్శించారు. 

మహిళలే ఓట్లతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా,ఏర్పాటు చేయాలన్నా మహిళా శక్తే కీలకమని తెలిపారు. అలాంటి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం జగన్ శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 80శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని చెప్పుకొచ్చారు. అయిదేళ్ల పరిపానలతో చేయాల్సిన హామీలను అయిదు నెలల్లో చేసి చూపించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని ప్రశంసించారు. 

చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇచ్చినా ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని సూచించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. 

వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్న సీఎం జగన్ గొప్పవారా లేక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గొప్పవారా ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. మహిళలు రోజుకు అరగంటైనా వార్తలు చూడాలని అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విశాఖలోని భూ కుంభకోణంలో సిట్ ద్వారా నిజాలు వెలుగులోకి వస్తాయని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇకపోతే ఏపీ సమస్యలపై పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరే పోరాటం చేశారని గుర్తు చేశారు. వైసీపీ విజయంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నాడు ఎన్టీఆర్‌ తర్వాత ఢిల్లీలో కేంద్రాన్ని ఎదురించిన తెలుగు వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి అవంతి శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.