అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సమసిపోయి కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

సాగునీటిపై ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అలాగే నదీ జలాల వినియోగంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలిపారు. 

ప్రతీ ఎకరాకు సాగునీరు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మాజీమంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మాట్లాడితే తప్పులొస్తాయనే లోకేష్ ట్వీట్లు చేస్తున్నారంటూ విమర్శించారు. 

ట్వీట్లు రాసేది లోకేష్ లేక మరేవరైనానా అన్న సందేహం కలుగుతోందన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పోలవరం పనులు ఆగిపోలేదని జరుగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.