పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని ఆరోపించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్‌. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనాలు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని ఆయన హెచ్చరించారు. 

పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారని మంత్రి నిలదీశారు. పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవన్న అనిల్ కుమార్.. ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదన్నారు.

పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబుకు కొత్త బట్టలు పంపిస్తామని అలాగే ఆయన స్వయంగా వచ్చి ప్రాజెక్ట్ ఎత్తు కూడా కొలుచుకోవచ్చని అనిల్ కుమార్ సెటైర్లు వేశారు.

2017లో పోలవరంపై కేంద్ర కేబినెట్‌ నోట్‌ను చంద్రబాబు చదివి వినిపించాలని మంత్రి డిమాండ్ చేశారు. 2017లో మీరు కేబినెట్‌లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా అని అనిల్ దుయ్యబట్టారు.

పోలవరం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని.. నిర్వాసితుల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా అని మంత్రి నిలదీశారు. కేవలం కమీషన్ల కోసం ఆలోచించారే తప్ప నిర్వాసితులతో ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. పోలవరాన్ని వైఎస్ఆర్‌ ప్రారంభించారని.. ఇప్పుడు వైఎస్ జగన్ దానిని పూర్తి చేస్తారని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.