అమరావతి: ఏపీ రాజకీయాల్లో లేఖల యుద్ధ మెుదలైంది. ఇటీవలే ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాసిన విషయం మరువక ముందే మరో మంత్రి బహిరంగ లేఖ రాశారు. అంతరాష్ట్ర ఉద్యోగులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ జగన్ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జగన్ కి లేఖ రాశారు. 

ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తాజాగా మరోమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్ జగన్ కి బహిరంగ లేఖ రాశారు. లేఖలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారంటూ విమర్శించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 

మన ఫోన్లను ట్యాప్‌ చేసి ఏపీకి రావాల్సిన పరిశ్రమలను తెలంగాణకు తరలించుకుపోతుంటే మీరెందుకు స్పందించలేదంటూ  జగన్ ని నిలదీశారు. చంద్రబాబు చొరవతోనే అనంతపురానికి కియా కార్ల పరిశ్రమ వచ్చిందని స్పష్టం చేశారు. 

అయితే కియా కార్ల పరిశ్రమ అనంతపురం రావడానికి తామే కారణమని బీజేపీ చెప్పుకుంటుంటే ఎందుకు ఖండించలేదని నిలదీశారు. ఇది మీ లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం కాదా అంటూ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై మోదీని ఏనాడైనా ప్రశ్నించారా?’’ అని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి జగన్ కు రాసిన లేఖలో ప్రశ్నించారు.