తిరుపతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అమర్ నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఎన్టీఆర్ గృహసముదాయాలను ప్రారంభించిన మంత్రి అమర్ నాథ్ రెడ్డి ప్రధాని మోదీపై మాట్లాడే దమ్ము ప్రతిపక్ష నేత జగన్‌కు లేదని విమర్శించారు. 

జగన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ, కేసీఆర్‌తో జగన్‌ కలిశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తారని ఆయన నిలదీశారు. అప్పుడు నీళ్లు, మట్టి ఇచ్చారని, ఇప్పుడు ఏం ఇస్తారని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. 

మోదీపై మాట్లాడాల్సి వస్తుందని వైసీపీ లోక్‌సభకు వెళ్లడం లేదన్నారు. చంద్రబాబు పథకాలను కాపీ కొట్టాలంటే జగన్‌కు 50 ఏళ్లు సరిపోవని విమర్శించారు. జగన్‌లా జనసేనాని పవన్‌కళ్యాణ్ అవినీతిపరుడు కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లపేరుతో దోచుకుతింటే తాము ప్రజలకు నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించామని మంత్రి అమర్ నాథ్ రెడ్డి తెలిపారు.