కడప: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఇప్పుడు పసుపు-కుంకుమ పథకం చుట్టూనే నడుస్తున్నాయి. పసుపు-కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆ చెక్కుల పంపిణీని ఒక పండుగులా నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. 

భారీ హంగులతో వేదికలపై ఊదరగొడుతూ నానా ప్రచారం చేసుకుంటుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు పసుపు కుంకుమ పథకం కింద ఇచ్చే చెక్కులపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.  

ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చెల్లించే చెక్కులు చెల్లవని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తాము ఇచ్చే చెక్కులు చెల్లితేనే మహిళలు, ప్రజలు టీడీపీకి ఓటు వెయ్యాలని లేని పక్షంలో వైసీపీకి ఓటు వెయ్యాలని తేల్చి చెప్పారు. 

ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న పతంగి రామన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పసుపు-కుంకుమ, పెన్షన్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. 

మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో కలిసి ప్రచారం చేస్తానని ప్రజలు ఆదరించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఆదినారాయణ రెడ్డి సూచించారు. అయితే ఎవరు పోటీ చేస్తారో అన్నది స్పష్టంగా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా తానే పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి ప్రకటించారు.