ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

జూలై 22 నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో శాసనమండలి ఛైర్మన్ కె.మోషేన్ రాజు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమావేశమయ్యారు.

AP Legislative Assembly Sessions to Commence from July 22: Security Measures Tightened GVR

అమరావతి: జూలై 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసనమండలి ఛైర్మన్ కె.మోషేన్ రాజు, శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై శుక్రవారం అసెంబ్లీ భవనంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు.

AP Legislative Assembly Sessions to Commence from July 22: Security Measures Tightened GVR

ఈసందర్భంగా రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, కొంతమంది శాసనమండలి సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో ఆయా సభ్యులను సక్రమంగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణం అత్యంత ముఖ్యమైన సెక్యురుటీ జోన్ అని, ఎవరు పడితే వారు లోనికి ప్రవేశించకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగని రీతిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని సీసీ కెమోరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు ఆదేశించారు.


శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ఈనెల 22వ తేదీ నుంచి 5రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. సమావేశాలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో గ్యాలరీల్లో ప్లకార్డులతో కొంతమంది ప్రవేశించిన సంఘటనలు చూశామని... అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ గ్యాలరీల్లోకి ప్రవేశించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించాలని స్పష్టం చేశారు. అంతేగాక గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోనికి అనుమతించాలన్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, 9 మంది శాసన మండలి సభ్యులు రానున్నారని.. వారిని గుర్తించేందుకు అసెంబ్లీ సిబ్బందిని ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేకంగా నియమించాలని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి, మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios