హైదరాబాద్: కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అధికారులతో ఏపీ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తో పాటు ఇతర ఇరిగేషన్ శాఖాధికారులు సోమవారం నాడు భేటీ అయ్యారు.

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచాలని జారీ చేసిన 203 జీవోపై ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో హైద్రాబాద్‌లోని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అధికారులతో ఏపీ ఇరిగేషన్ అధికారులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుకు ఏపీ రె'ఢీ'

203 జీవోపై ఏపీ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కృష్ణా బోర్డుకు వివరణ ఇస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణలోని మహాబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని కేసీఆర్ సర్కార్ చెబుతోంది.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులను ఏపీ ఇరిగేషన్ అధికారులు కృష్ణా బోర్డుకు వివరించారు. కృష్ణా నదిలో తమ రాష్ట్రానికి ఉన్న వాటా మేరకు పోతిరెడ్డిపాడు ద్వారా వాడుకొంటామని ఏపీ సర్కార్ వాదిస్తోంది.ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై తమ వాటా కంటే ఎక్కువగా నీటిని వాడుకొనేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని కూడ ఏపీ ఇరిగేషన్ అధికారులు కృష్ణా బోర్డుకు వివరించనున్నారు. ఇదే విషయమై ఇటీవలనే కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.