నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి తాండవిస్తుందని ఆరోపిస్తూ సీఎం వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నట్లు నిర్ణయించారు. 

అంతేకాదు పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో రీ టెండరింగ్ పై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అసహనం వ్యక్తం చేసింది. 

రీటెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. రీ టెండరింగ్ బాధాకరమంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 

రీ టెండరింగ్ వల్ల పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోతాయనడం అర్థం లేని వ్యాఖ్యలు అంటూ కొట్టి పారేశారు. పోలవరం నిర్మాణ పనులు నవంబర్‌ 1 నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.  

పోలవరంలో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యలతోనే పోలవరం ఆలస్యమవుతోందనడంలో అర్థం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. సెప్టెంబర్‌ వరకు పోలవరంలో ఎలాంటి పనులూ జరగవని తెలిపారు. 

సెప్టెంబర్‌ నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తామని తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రాజెక్టు పనులు చేపడతామన్నారు. 2021ఆఖరు కల్ల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.