అమరావతి: కేంద్రం నిర్మించాల్సిన  పోలవరం   ప్రాజెక్టును ప్యాకేజీల కోసం రాష్ట్రమే నిర్మించేందుకు చంద్రబాబు ఒప్పుకొన్నారని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు.

బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చను మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. ప్రాజెక్టుకు సంబంధించి మారిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం కోరినా కూడ గత ప్రభుత్వం వాటిని సమర్పించకుండా కాలయాపన చేసిందన్నారు. 

also read:మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేల వాకౌట్

కేంద్ర ప్యాకేజీ కోసం 2014 రేట్లకే పోలవరం నిర్మించేందుకు చంద్రబాబు ఒప్పుకొన్నారని ఆయన ఆరోపించారు.9 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడ చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పట్టించుకోలేదని మంత్రి అనిల్ విమర్శించారు.2004లో పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

2005లోనే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయన్నారు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని ఆయనన విమర్శించారు.

ముంపు బాధితుల గురించి ఒక్కమాట కూడ మాట్లాడలేదన్నారు.పోలవరం ఏపీకి జీవనాడి అని చెప్పే చంద్రబాబు.... ఆ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.

18 శాతం ప్రాజెక్టు కట్టి 70 శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని అంటున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  మీరు నిర్మించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

మాట్లాడితే  పట్టిసీమ అంటారు... మీరు చెప్పుకొంటున్న పట్టిసీమలో కూడా 80 శాతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంట్రిబ్యూషన్ ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అనిల్ అన్నారు.ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని  తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి చెప్పారు.