నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం ప్రారంభోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చింది వైయస్ జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తనను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని ఇంతకంటే తనకు ఏం అవసరం లేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. 

తన జన్మ ధన్యమైందని చెప్పుకొచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు జగనన్ననకు సైనికుడిగా ఉంటానన్నారు. జీవింతాంతం జగనన్న అనుచరుడిగా బతికేస్తానని స్పష్టం చేశారు. తాను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో లేక తన తల్లిదండ్రులు చేసిన పుణ్యమోకానీ మంత్రి పదవి దక్కించుకున్నానని చెప్పుకొచ్చారు.  

నా తండ్రి పైనున్నారు. నా తల్లి ఇక్కడే ఉంది. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించబోతున్నట్లు తెలిపారు. 

ఇంకా 25 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎవరు ఎన్ని గింజుకున్నా ఇక ఛాన్స్ లేదన్నారు. వేరేవారికి ముఖ్యమంత్రిగా మరో 25 ఏళ్ల వరకు అవకాశం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.