ఏపీ వాటా నీటిని తెలంగాణ కాజేస్తోంది, అడ్డుకోండి: కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరుల శాఖ లేఖ

కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్ట్‌లను అడ్డుకోవాలని ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు కేంద్ర జలశక్తి శాఖకు గురువారం లేఖ రాశారు. 

ap irrigation department secretary syamala rao letter to jal shakti ministry ksp

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జలవివాదం నేపథ్యంలో నిత్యం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఇరు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపాలని ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు కేంద్ర జలశక్తి శాఖకు గురువారం లేఖ రాశారు. కృష్ణానదిపై తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌లను ఆపాలని విజ్ఞప్తి చేశారు. 

8 భారీ ప్రాజెక్ట్‌ల ద్వారా 183 టీఎంసీల నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని జలశక్తి శాఖకు శ్యామలరావు ఫిర్యాదు చేశారు. ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా, ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లతో అనుమతులు లేకుండానే కృష్ణానది నీటిని తెలంగాణ వినియోగించుకుంటున్నట్లు శ్యామలరావు ఫిర్యాదు చేశారు. 

Also Read:కృష్ణా నదీ నీళ్లపై కేంద్ర మంత్రులకు జగన్ లేఖలు: కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు

అంతకుముందు ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ..  రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి కేటాయింపులు జరుపుకున్నాయన్నారు. 881 అడుగుల నీటిమట్టం వుంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావన్నారు. 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిగాయన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగన్ ఆరోపించారు. తెలంగాణ మంత్రులు కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ 881 అడుగుల లోపే వాడుకుంటున్నారని సీఎం ఆరోపించారు. రాయలసీమ పరిస్ధితి మీకు తెలియదా అని జగన్ ఎద్దేవా చేశారు. మాకు కేటాయించిన నీటిని మేం తీసుకుంటే తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios