విజయవాడ: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రజలకు నీటి పారుదలశాఖ విజ్ఞప్తి చేసింది. పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలతో మన రాష్ట్రంలో అనేక నదులు, కాలువలు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. 

రాబోవు దసరాల సెలవుల నేపథ్యంలో నదీపరివాహక ప్రాంతాలలో, ముఖ్యంగా నది ఒడ్డును పుణ్యస్నానములు చేయు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కాలువలలో పిల్లలు, యువకులు సరదాలకు పోయి ఈతలకు వెళ్లకుండా ఉండాలని ప్రకటనలో తెలిపారు. 

నదులు, సముద్రంలోకి విహార యాత్ర చేయదలచిన వారు వాయిదా వేసుకోవాలని సూచించింది. రాబోయే మూడు రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కోరింది. 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలలో పరిస్థితులను సమీక్షిస్తారని ప్రకటనలో తెలిపింది నీటి పారుదల శాఖ.