వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కల్యాణ్‌కు ఎందుకు సమాచారం ఇస్తాయని ఆమె ప్రశ్నించారు. 

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏకంగా ఆయనపై కేసు పెట్టే వరకు వ్యవహారం వెళ్లింది. మరోవైపు వైసీపీ నేతలు సైతం పవన్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా హోంమంత్రి తానేటి వనిత సైతం పవన్‌పై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లను తప్పుబడుతూ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లుగా అత్యధికంగా పనిచేస్తోంది మహిళలేనని వనిత తెలిపారు. 

అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కల్యాణ్‌కు ఎందుకు సమాచారం ఇస్తాయని హోంమంత్రి ప్రశ్నించారు. నిఘా సంస్థలు ఇలాంటి సమాచారాన్ని ఎవరికిస్తారో కూడా పవన్‌కు తెలియదంటూ ఆమె దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వుండబట్టే.. ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. పరువు నష్టం దావా వేస్తే జైలుకు వెళ్తారో లేదో కూడా తెలియని స్థితిలో జనసేనాని వున్నారంటూ తానేటి వనిత చురకలంటించారు. 

ALso Read: కడుపైనా చేయాలంటాడు: బాలయ్యపై జగన్, "పవన్ లోబరుచుకుని వదిలేస్తాడు"

చంద్రబాబు ట్రైనింగ్, రామోజీ స్క్రిప్ట్‌తో పవన్ కళ్యాణ్ ఇది సినిమా అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి దుయ్యబట్టారు. సినీ పరిశ్రమకు, రాజకీయాలకు చాలా వ్యత్యాసం వుందన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజల నుంచి సేకరించిన సమస్యల పట్ల స్పందించాలే కానీ.. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే, దానిని చదివితే ఇలాగే వుంటుందంటూ ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్ చేస్తున్న యాత్రలను జనం పట్టించుకోకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు లోనై ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని తానేటి వనిత ఆరోపించారు.