ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా తల్లులే జాగ్రత్త పడాలని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కోరారు.  పిల్లల విషయంలో తల్లులు జాగ్రత్త పడకుండా పోలీసులపై, ప్రభుత్వంపై నిందలు వేయవద్దని ఆమె సూచించారు. 

అమరావతి:ఆడపిల్లలలపై అఘాయిత్యాలు జరగకుండా జరగకుండా తల్లులే జాగ్రత్తపడాలని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి Taneti Vanitha కోరారు. విశాఖపట్టణంలోని దిశ పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి తానేటి వనిత శనివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 

తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందన్నారు. తల్లి కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. మహిళా పక్షపాతి అయినా తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 

ఇలాంటి కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. తాళ్లపూడిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మూడు రోజుల వరకు కేసు నమోదు చేయలేదు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఈ విషయంలో విచారణకు ఆదేశించామన్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టీడీపీ హయాంలోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. అయితే అప్పుడు వారు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కేసులు వెలుగులోకి రాలేదని మంత్రి వనిత వివరించారు.

పనులకు వెళ్లిన కారణంగా పిల్లలను తాము రోజంతా చూసే సమయం దొరకదని కొందరు తల్లులు చెప్పే పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారరు. ఆడపిల్లల విషయంలో తండ్రి కంటే తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుందని Andhra Pradesh హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.తల్లిగా మనకు మనం సంరక్షణ ఇస్తూ పిల్లలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు పిల్లలపై ఏదైనా అఘాయిత్యం జరిగితే న్యాయం జరగాలని పోరాటం చేస్తామన్నారు.

తల్లి పాత్ర పోషించకుండా పోలీసులపైనో, ప్రభుత్వంపైనో నిందలు వేయడం సరైంది కాదన్నారు. తల్లిగా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలని Home Minister వనిత కోరారు. ఏదైనా సమయంలో పిల్లలకు ఇతరులతో ఇబ్బందులు కలిగితే ఆ సమయంలో పోలీసుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. పిల్లలు పెరిగే వాతావరణం కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగేందుకు కారణమౌతుందని వనిత అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలను తప్పుబట్టారు. 

హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత ఈ వ్యాఖ్యలు చేయడాన్ని అనిత దుయ్యబట్టారు. మంత్రి వ్యాఖ్యలు రాష్ట్రంలోని తల్లులను కించపర్చేలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరగడం కూడా తల్లుల తప్పేనా అని ఆమె ప్రశ్నించారు. మంత్రిగా ుంటూ ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారని టీడీపీ నేత వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.