విజయవాడ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదంపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని మంత్రి డీజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు.

కరోనా రోగులు అగ్నిప్రమాదం బారినపడటం బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.షార్ట్ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని ఆదేశించారు. 

also read:ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘణ: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 11కి చేరిన మృతులు

ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ హోటల్ లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఈ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చింది. 

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఈ హోటల్ లో 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదంతో పొగ వ్యాపించి ఊపిరి ఆడక రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరో వైపు మంటల భయంతో కొందరు ఆసుపత్రి భవనం పై నుండి కిందకు దూకారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డీజీపీ, కలెక్టర్, సీపీ శ్రీనివాసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు ఆదివారం నాడు పరిశీలించారు.