అమరావతి: పోలీస్ శాఖలో ప్రమోషన్ల రగడ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారంటూ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 

వైఎస్ జగన్ ఆరోపణలపై హోంశాఖ మంత్రి చినరాజప్ప ఘాటుగా స్పందించారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పాటించాలని అది తాము పాటించినట్లు స్పష్టం చేశారు. ఒక్క పోస్ట్ కూడా డైవర్ట్ కాలేదని ఒకే వర్గానికే అన్ని ప్రమోషన్లు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమంటూ కొట్టి పారేశారు. 

ప్రమోషన్లపై వైఎస్ జగన్ కు ఛాలెంజ్ చేశారు. చర్చకు జగన్ సిద్ధం కావాలన్నారు. డీజీపీ ఆర్ పీ ఠాకూర్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ మరింత గాడిన పడిందని స్పష్టం చేశారు. ఉంటానా.. జైలుకు పోతానా అనే భయం జగన్ కు పట్టుకుందని విమర్శించారు. 

ప్రమోషన్లపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చినరాజప్ప స్పష్టం చేశారు. 35 మంది ఓసీలకు నాలుగేళ్లలో ప్రమోషన్లు వచ్చాయని ఒకేసారి కాదన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందికి ప్రమోషన్లు ఇచ్చామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాలను నమ్మెద్దని హోంమంత్రి చినరాజప్ప కోరారు. 

ఇకపోతే ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఒక అధికారికి ఏకంగా లేని పదవిని కూడా సృష్టించారని వైఎస్ జగన్ సిఈసీకి ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి బహిష్కరించాలని జగన్ కోరిన విషయం తెలిసిందే.