కాకినాడ: తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యబోతున్నానో అన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మళ్లీ తాను పెద్దాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు  ప్రకటించారు.పెద్దాపురం నుంచి తాను పోటీ చేయడంలేదన్న వదంతుల్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

ప్రజల సహకారంతో తాను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. ఈ నెల 22న టీడీపీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు చినరాజప్ప స్పష్టం చేశారు. 

ఇటీవలే చినరాజప్ప తన ఎన్నికల ప్రచార రథాన్ని సైతం ప్రారంభించారు. అయితే గత కొంతకాలంగా చినరాజప్ప కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల నేపథ్యంలో అలర్ట్ అయిన చినరాజప్ప తాను మళ్లీ పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చి వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.