Asianet News TeluguAsianet News Telugu

అమరావతి రైతులకు చుక్కెదురు: జోన్-5 పై పిటిషన్ ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు

జోన్ 5  అంశంపై  అమరావతి  రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు  తిరస్కరించింది. 

AP HighCourt Quashes  Amaravathi   Farmers  Petitions  on R5 Zone  lns
Author
First Published May 5, 2023, 2:37 PM IST | Last Updated May 5, 2023, 3:56 PM IST

అమరావతి:  జోన్ 5 అంశంపై  అమరావతి రైతులు దాఖలు  చేసిన  అనుబంధ పిటిషన్ ను  ఏపీ  హైకోర్టు  శుక్రవారంనాడు తిరస్కరించింది.   మరో వైపు ఇళ్ల పట్టాలకు సంబంధించి  కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని  ఏపీ హైకోర్టు  సూచించింది. 

 రాజధాని ఏ ఒక్కరికో, ఒక వర్గానికి పరిమితం కాదని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.రాజధాని ప్రజలందరిదన్నారు. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా  ఏపీ హైకోర్టు  ధర్మాసనం ప్రశ్నించింది.  రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేనని పేర్కొంది. 

 ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదని  హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని స్పష్టం  చేసింది.  భూములు ఇచ్చిన వారివి కావని హైకోర్టు తెలిపింది.   ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు.    రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని  ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.  నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ విధుల్లో భాగమని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.

అమరావతిలోని ఆర్-5  జోన్ లో  గుంటూరు,  ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని  పేదలకు  ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు  ఏపీ ప్రభుత్వం  45 నెంబర్ జీవోను జారీ చేసింది.   ఒక్కో  కుటుంబానికి  సెంటు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం  ఈ జీవో ద్వారా  ప్రకటించింది.  10 లే అవుట్లలో  45 వేల మంది పేదలకు  ఇళ్ల స్థలాలు ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

జీవో నెంబర్  45 ను అమలు  చేయకుండా  ఇవ్వాలని అమరావతి  రైతులు  ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ విషయమై  ఇరువర్గాల వాదనలు విన్న  ఏపీ హైకోర్టు  ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే విషయమై  అమరావతి  రైతులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీంకోర్టులో కూడా అమరావతి రైతులకు  నిరాశే మిగిలింది.  

ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడ అనుకూలమైన తీర్పు రావడంతో   అమరావతిలో  ఇళ్ల పట్టాల పంపిణీపై  ప్రభుత్వం  చర్యలను మరింత వేగవంతం  చేసే అవకాశం ఉంది.  ఈ నెల  15వ తేదీలోపుగా  అమరావతిలో  ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ప్రభుత్వం  చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే  ఇళ్ల స్థలాల పంపిణీ తుది తీర్పునకు లోబడి ఉండాలని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. 

 ఈ పిటిషన్ పై వాదనలు రెండు రోజుల క్రితమే ముగిశాయి. ఇవాళ తీర్పును వెల్లడించనున్నట్టుగా  ఏపీ హైకోర్టు తెలిపింది.  ఇవాళ  మధ్యాహ్నం  ఏపీ హైకోర్టు  ఈ విషయమై తీర్పును వెల్లడించింది.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios