జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు జీవో నెంబర్ 1 సస్పెన్షన్ విధించింది. ఏపీలోని రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను సవాలు చేస్తూ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంది. జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకు సస్పెన్షన్ విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఇక, ఈ పిటిషన్‌పై విచారణ సందర్బంగా రామకృష్ణ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అశ్వినీ కుమార్.. ప్రజల భావప్రకటన స్వేచ్చ, ప్రాథమిక హక్కులను కాలరాసేలా జీవో ఉందన్నారు. జీవో నెంబర్ 1ను కొట్టి వేయాలని కోరారు. మరోవైపు హైకోర్టు వెకేషన్ బెంచిలో ఈ పిటిషన్ విచారణకు రావడంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన అంశం రోస్టర్‍లో రావడానికి ఆస్కారం లేదని.. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాలకు సంబంధించిన కేసులను విచారించకూడదని వాదనలు వినిపించారు.
ఇక, ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వంహెచ్చరించింది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది.
అయితే ప్రజల మేలు కోసమే తాము ఈ జీవో తీసుకోచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం జీవో నెంబర్ 1ను కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తీసుకొచ్చిందని మండిపడుతున్నాయి.