అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) ఎన్నికలు వివాదాస్పదం అవుతున్నాయి.  సిఎస్ఐ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై ఇవాళ(సోమవారం) హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి డయాసిస్ ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాలు ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ సీపీ, మైనారిటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. 

చర్చి ఆఫ్ సౌత్ ఇండియా ఎన్నికలను చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు విన్నవించగా... ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు.  గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరుగుతున్నదని పిటీషనర్ తరఫు న్యాయవాది తెలపగా కోర్టు ఎన్నికలపై మూడు వారాలు స్టే ఇచ్చింది.