ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు  చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ గతేడాది జూన్‌లో మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 84ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీకాకుళానికి చెందిన ఎన్‌ మురళీకృష్ణ అనే వ్యక్తి హైకోర్టు ఆశ్రయించారు. జీవో 84 అమలుపై స్టే విధించేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

మరోవైపు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని విచారణకు తీసుకుంటామని చెప్పారు. ఈ జీవో ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తదుపరి విచారణను జూన్ 16కి వాయిదా వేశారు. 

Also Read: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలకు మరో 268 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ..