ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలపై స్టే విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన అనంతరం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేకు కోడ్ విధించలేదని టీడీపీ పిటిషన్‌లో పేర్కొంది.

విచారణ సందర్భంగా పోలింగ్‌కు కనీసం నాలుగు వారాల ఎన్నికల కోడ్ ఉండాలన్న సుప్రీం నిబంధన అమలు కాలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకుకొచ్చారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం.. ఎస్ఈసీ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.

అలాగే కొత్త నోటిఫికేషన్ అవసరం కూడా లేదని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.

దీంతో రాష్ట్రంలోని 7,258 ఎంపీటీసీలు, 511 జడ్పీటీసీలకు ఎల్లుండి జరగాల్సిన  ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎస్ఈసీ.