కాకినాడ జేసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై కోర్టు ఆదేశాలను జేసీ పక్కనబెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు ఆదేశించింది.

థియేటర్ల వినతిపై టికెట్ ధరల పెంపునకు గత నెల 25న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా జేసీ ఆదేశాలు ఇవ్వడంపై సుమోటోగా కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది. మే 6న కాకినాడ జేసీ స్వయంగా వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. అలాగే జేసీ ఇచ్చిన మెమో నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

Also Read:వకీల్ సాబ్ మానియా: పవన్ కల్యాణ్ భుజం మీద బిజెపి తుపాకి....

అంతకుముందు మూడు రోజుల పాటు వకీల్‌ సాబ్‌ సినిమా టికెట్ల ధరల్ని పెంచుకోవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఇవాళ ఈ పిటిషన్‌ విచారణకు రానుంది.

శనివారం కావడంతో కోర్టుకు ఈరోజు సెలవు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఇంటి నుంచే ఈ పిటిషన్‌ను విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం రాజకీయంగా రచ్చ జరుగుతున్నా ఎట్టి పరిస్దితుల్లోనూ వకీల్‌సాబ్‌ టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెబుతోంది.