అమరావతి: రాజధాని ప్రాంత రైతులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ముఖ్యంగా వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయడంపై పోలీసులకే కాదు వైసిపి ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. పోలీసులు పెట్టిన అట్రాసిటి కేసు చెల్లదని... అలాగే వారిపై పెట్టిన  మిగతా సెక్షన్లన్నీ బెయిల్ ఇవ్వదగినవేనని కోర్టు పేర్కొంది. వీటి గురించి తెలిసినా రైతులను ఎలా అరెస్ట్ చేశారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. 

''సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారు. వ్యక్తిగత స్వేచ్చను హరించేలా రైతులతో వ్యవహరించారు. ఆ హక్కు పోలీసులకు ఎక్కడిది? అలాగే రైతులను రిమాండ్ కు తరలించి న్యాయాధికారి కూడా నిబంధలను అతిక్రమించారు. పోలీసులు పెట్టిన సెక్షన్ల కింద నిందితులను రిమాండ్ కు తరలించే వీలు లేదు'' అన్నారు హైకోర్టు న్యాయమూర్తి.   

 రైతుల అరెస్ట్ వ్యవహారంపై రాష్ట్ర డిజిపి పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని...రెండు వారాల్లో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. అలాగే రైతులను రిమాండ్ కు పంపిన మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, వారి బెయిలు పిటిషన్‌ను కొట్టేసిన గుంటూరు నాలుగో అదనపు సెషన్స్‌ ప్రత్యేక జడ్జి కూడా నివేదికలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అరెస్టయిన రాజధాని రైతులు ఏడుగురికీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.